- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థులు కోసం వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారా అని ఉపాధ్యాయులను ఆరా తీశారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లైతే తహశీల్దార్ కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు

తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని ఆదేశించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కడైనా సౌకర్యాల లేమి ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- విద్యార్థులకు మంచి భోజనం అందించాలి
- అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనం ను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతీ వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని తెలిపారు. విద్యార్థులు హ్యాండ్ వాష్ సరిగా చేస్తున్నారో లేదో పరిశీలించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యెక అధికారి, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

