- పూర్వీకుల ఆహార పరంపరపై విద్యార్థుల్లో అవగాహన
బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్దల కాలం నాటి సంప్రదాయ వంటకాలను రుచికరంగా తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి వంటకంలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే సందర్శకులకు వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో మాట్లాడిన కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రజలు జంక్ ఫుడ్‌లు, కల్తీ పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన పూర్వీకులు రసాయనాలు లేని సహజ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా జీవించారని, ప్రస్తుతం పాశ్చాత్య దేశాలు కూడా మన సంప్రదాయ భారతీయ ఆహారపు విలువను గుర్తించి తమ జీవనశైలిలోకి దానిని చేరుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత అందరూ పెద్దలు అనుసరించినట్లే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని, అలా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.

