- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
కామారెడ్డి/ పిట్లం, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి నర్సింగ్ రావు పల్లి సర్కిల్ దగ్గర ఘన స్వాగతం పలికారు. నర్సింగ్ రావు పల్లి సర్కిల్ నుండి పిట్లం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తల జేజేలు,అభిమానుల కేరింతలు, టపాసుల మోతలు, డీజే పాటలు, డప్పు చప్పుళ్ల నడుమ భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీతో బయలుదేరి మార్గమధ్యలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కి సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డీసీసీ నియామక ప్రక్రియ మొదలయిన నాటి నుండి తనకు మద్దతు ఇచ్చి అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం అని అన్నారు.

అధిష్టానం తన మీద విశ్వాసం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు అందరి సలహాలు, సూచనలు పాటిస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులుగా ఏలే మల్లికార్జున్ ని నియమించబడటం జుక్కల్ నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. ఒక సామాన్య కార్యకర్త జిల్లా అధ్యక్షుడుగా ఎంపిక కావడం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు, గౌరవం లభిస్తుందని చెప్పడానికి మల్లికార్జున్ నియామకమే గొప్ప ఉదాహరణ అని చెప్పారు. మల్లికార్జున్ నిబద్ధత కలిగిన నాయకుడు అని,ఆయన సారథ్యంలో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గానికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినందుకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బహుమతిగా ఇద్దామని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తానని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ ఇంటికి చేరవేసే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సన్మాన సభకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు,కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

