29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

  ప్రశాంతంగా మొదటి విడత పోలింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7.00 గంటలకు   ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన 78.83 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం వివరాలను తదుపరి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారంలలో, బోధన్ మండలం పెగడాపల్లిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు. కలెక్టర్ పర్యవేక్షణలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.ప్రతి నివాస ప్రాంతంలో వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీ.ఎల్.ఓలతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.  71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 31 కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, 40 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు.  కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్, వర్ని మండలం సత్యనారాయణపురం, చందూర్, మోస్రా, బోధన్ మండలం అమ్దాపూర్, ఎడపల్లి తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

More articles

Latest article