బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం, పెంటకుర్దు గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధికారులు రైతులకు వరి పంట సాగులో నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేరుగా వరి విత్తడం ద్వారా డైరెక్ట్ సీడెడ్ రైస్, డ్రం సీడర్, తడి-పొడి పద్ధతుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గడం, కూలీల ఖర్చు మరియు సమయం ఆదా కావడం, నీటి వినియోగం నియంత్రణలో ఉండడం వంటి లాభాలు ఉంటాయని తెలిపారు. అలాగే భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు, మందుల వినియోగం తగ్గించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగేశ్వర్రావు, శ్రీనివాసరావు, ఏఈఓ సాయిచరణ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి డి.ఎస్. గణేష్ సాగర్ (బోధన్ ఏరియా మేనేజర్), బి. ఫణీంద్ర, ప్రశాంత్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

