. . . కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రైతన్నలకు ఈ దుస్థితి వచ్చింది
. . . రైతులకు సరిపడా టార్ఫాలిన్ కవర్లను తక్షణమే సరఫరా చేయాలి
. . . వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి
. . . బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఆపత్కాలంలో రైతన్నలకు భరోసా ఇవ్వాలని, వారికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేక సెల్ ఫోన్ ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతుల ఆరుగాలం కష్టం కళ్లముందే నీళ్లపాలవుతోందని ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ తమ పరిధిలో అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోయి ఆందోళనలో ఉన్న ప్రతి రైతుకు పార్టీ తరఫున అండగా నిలవాలని, పూర్తి మద్దతు, సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబడి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే, వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. “రైతు కంటతడి పెడితే ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని పేర్కొన్న కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని హెచ్చరించారు.

