28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తరగతి గదుల్లో కాటేసే కళ్లు

Must read

📰 Generate e-Paper Clip

. బాలికలను వేధిస్తున్న కొందరు ఉపాధ్యాయులు

. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 15 పోక్సో కేసులు

. రామారెడ్డి పీఎస్ లో రెండు కేసులు నమోదు

. విద్యావ్యవస్థకు కళంకం తీసుకొస్తున్న ప్రబుద్ధులు

. బాలికలను పాఠశాలలకు పంపించేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు

కామారెడ్డి, బతుకమ్మ: బడికి వెళ్లాలంటేనే బాలికలు హడలెత్తే పరిస్థితి తీసుకొస్తున్నారు కొందరు టీచర్లు. బాలవికాసానికి, వ్యక్తిగత జీవితానికి పునాదులు వేయాల్సిన బడులు కొందరు ప్రబుద్ధుల కారణంగా బాలికల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కేంద్రాలుగా మారుతున్నాయి. ఆ టీచర్లు కామారెడ్డి జిల్లా విద్యాశాఖకు కళంకం తీసుకొస్తున్నారు. సహచరులపై పోక్సో కేసులు నమోదవుతుండడంతో తోటి ఉపాధ్యాయులు సైతం తలెత్తుకోలేని పరిస్థితి ఉంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 15 పోక్సో కేసులు నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. బాలికలను పాఠశాలలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

          నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్ లో పని చేస్తున్న నలుగురు ఉపాధ్యాయులపై ఒకే ఘటనలో పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదుకాగా, అదే స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదైంది. ఒక్క నిజాంసాగర్ పీఎస్ పరిధిలోనే ఐదుగురు టీచర్లు కటకటాలపాలయ్యారు. కామారెడ్డి, భిక్కనూర్, లింగంపేట, నాగిరెడ్డిపేట పీఎస్ లలో ఒకటి చొప్పున, గాంధారిలో రెండు పోక్సో కేసులు టీచర్లపై నమోదు కాగా, ఈ వారం రోజుల వ్యవధిలో రామారెడ్డి పీఎస్ లో ఇద్దరు టీచర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి అటు విద్యావర్గాలను, ఇటు బాలికల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

కొందరి కారణంగా మొత్తం ఉపాధ్యాయ వృత్తికే కళంకం వస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. స్కూళ్లలో టీచర్లనే సంరక్షణ అధికారులుగా నియమించడంతోపాటు పోలీసుశాఖ ఆధ్వర్యంలో షీ టీములు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. ఎవరితోనైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే తమకు సమాచారం అందించాలని విద్యార్థినులకు ఫోన్ నంబర్లను ఇస్తున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తోపాటు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఉపాధ్యాయుల వంకర బుద్ధి కారణంగా బాలికలు ఇబ్బందులు ఎదుర్కొటూనే ఉన్నారు. కొందరు బయటికి చెప్పుకోవడానికి భయపడుతున్నారు.

రామారెడ్డి ఘటనలను కప్పిపుచ్చే ప్రయత్నాలు..

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్కూళ్లలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై వారం రోజుల వ్యవధిలో పోక్సో కేసులు నమోదు కాగా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎంఈవో ఇంతర వరకు స్పందించకపోవడం గమనార్హం. ఓ గ్రామానికి చెందిన విద్యార్థినితో అసభ్యకరంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని షీ టీము అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలను ఎంఈవో కప్పి పుచ్చడం వెనుక కారణాలు ఏమిటనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు ఉన్నతాధికారులకు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉంటూ వ్యవస్థను నడిపించాల్సిన మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు చక్కబడుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More articles

Latest article