26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అరుణాచల్ ప్రదేశ్‌లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు

Must read

📰 Generate e-Paper Clip

  • అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్

 

హైదరాబాద్, బతుకమ్మ : ఇటానగర్ లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా నుంచి ఆన్సర్లు చెబుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలో ఈ మోసం బయటపడింది.  ఈ నెల 18న సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షల కోసం అధికారులు ఇటానగర్‌లోని వీకేవీ చింపూ, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌ లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సమయంలో, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో ఒక అభ్యర్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జరిపిన సోదాలో సదరు అభ్యర్థి వద్ద చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, అతి సూక్ష్మమైన ఇయర్‌పీస్ లభ్యమయ్యాయి. దీంతో ఆ కేంద్రంలో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులనూ తనిఖీ చేయగా.. 23 మంది అభ్యర్థుల వద్ద అలాంటి పరికరాలు లభ్యమయ్యాయి. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివేకానంద కేంద్ర విద్యాలయ కేంద్రంలోనూ తనిఖీలు జరపగా.. రెండు కేంద్రాల్లో మొత్తం 53 మంది అభ్యర్థులను అరెస్టు చేసినట్లు, వారి నుంచి 29 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ మోసం వెనుక పెద్ద ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని నమ్మించి, భద్రతా లోపాలు ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవాలని ఈ ముఠా అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. అడ్మిట్ కార్డులు జారీ అయ్యాక, జీఎస్ఎం ఆధారిత పరికరాలను అందించి, వాటిని రహస్యంగా ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారని పోలీసులు వివరించారు.

More articles

Latest article