బతుకమ్మ ,భీమ్‌గల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ 14 భాషల్లో పట్టు కలిగిన బహుభాషావేత్త, తెలంగాణ పదకోశ రూపకర్త (నిర్మాత),తెలంగాణ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం రావడం అభినందనీయమని ప్రముఖ కవి, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద కాళోజీ పురస్కారాన్ని కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9న ప్రతి ఏటా తెలంగాణ భాషకు సాంస్కృతిక సేవలకు గాను ఆయన జయంతి రోజును “తెలంగాణ భాషా దినోత్సవం” గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు పరుస్తుందని అన్నారు. కాళోజీ పురస్కారం కింద అవార్డు, మెమెంటో 10,1,116 రూపాయల నగదు బహుమతిని అందజేసి ఘనంగా శాలువాతో సత్కరిస్తారు.2015లో అమ్మంగి వేణుగోపాల్, 2016లో గోరేటి వెంకన్న, 2017లో రావులపాటి సీతారాం, 2018లో అంపశయ్య నవీన్, 2019లో కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 2020లో రమా చంద్రమౌళి, 2021లో పెన్నా శివరామకృష్ణ, 2022లో శ్రీరామోజు హరగోపాల్, 2023లో శ్రీ జయరాజు లు కాళోజీ అవార్డును పొందారని కంకణాల రాజేశ్వర్ వివరించారు..
