28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సంక్రాంతి తరువాత రైతు భరోసా

Must read

📰 Generate e-Paper Clip

. నిజాంసాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి

. నాగమడుగు ప్రాజెక్టులు నిధులిస్తాం

. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నిజాంసాగర్, బతుకమ్మ: తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, పంటల బీమా అమలు చేయడంతోపాటు సంక్రాంతి తరువాత నుంచి రైతు భరోసా అందిస్తామని రాష్ర్ట నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట అనంతరం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషం గా ఉందన్నారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపు గా వాడుకోవాలని, పంటలకు నీటిని ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని అన్నారు. నాగ మడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగానే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తికావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దేశంలోనే ఈసారి తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగయ్యిందని, కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడుకోలేదన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ర్టవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు మూడు రోజుల్లో డబ్బుల చెల్లింపు పూర్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఇరిగేషన్ ను నాశనం చేసిందని, లక్షల కోట్ల అప్పులు చేసి నాటి ప్రభుత్వం సాధించేదేమీ లేదని విమర్శించారు. తాము పదినెలల కాలంలో 55వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని, త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వానికి  ప్రజా ఆశీర్వాదం ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article