. . . వెల్నెస్ సెంటర్ ఎదుట పెన్షనర్ల ధర్నా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ డాక్టర్లు లేక వెలవెల పోతోందని, వేలాదిమందికి ఆరోగ్య సేవలు అందించే ఈ వెల్ నెస్ సెంటర్ లో డాక్టర్లు లేకపోతే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉంటుందో ఆలోచించాలని రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే రామ్మోహన్ రావు అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ప హనుమాన్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాని రామ్మోహన్ రావు ప్రారంభిస్తూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ లో ఉన్న మందులకు రక్షణ లేకుండా పోయిందని, నిర్ణీత టెంపరేచర్ లో ఉండాల్సిన మందులు ప్రస్తుతం ఉన్న ఎండలకు అవి పని చేస్తాయా, లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందని, దీనిని బట్టే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని అన్నారు. వెల్ నెస్ సెంటర్ లో వాష్ రూమ్లు, మంచినీటి వసతి సరిగా లేవని, అలాగే ఎండలో నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మందులు కూడా ఎండలోనే ఉండి తీసుకోవడం జరుగుతుందని, మహిళలందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. వెల్ నెస్ సెంటర్ లో ఉన్న పరిస్థితిని కలెక్టర్ దృష్టికి, జనరల్ హాస్పిటల్స్ సూపరిండెంట్ దృష్టికి తీసుకెళ్లిన కూడా పరిష్కారం దొరకట్లేదని అన్నారు.

ఈ ధర్నాకి హాజరైన జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వెల్ నెస్ సెంటర్ తమకు, తమ కుటుంబ సభ్యులకి ఎంతో ఉపయోగంగా ఉండేదని, కానీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇది పనికి రాకుండా పోయిందని అన్నారు. ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు పురుషోత్తం, ప్రసాద్ రావు, లావు వీరయ్య, రాధా కిషన్, మేరీ, సాంబశివరావు, బేబీ, సింధు, బాల దుర్గయ్య, లక్ష్మీనారాయణ, బోధన్ రామారావు, పబ్బ మురళి, తదితరులు పాల్గొన్నారు. తదనంతరం పెన్షనర్ల సంఘం, జర్నలిస్టుల ప్రతినిధి బృందం హాస్పిటల్ సూపరిండెంట్ కు సమస్యల గురించి మెమోరాండం సమర్పించారు.

