జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో జిల్లా జడ్పీ సీఈవో చంద్ర నాయక్ శుక్రవారం పర్యటించి ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల, యూపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడి విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్ర నాయక్, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి వారి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, సేవలపై కూడా ఆయన ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. జిల్లా జడ్పీ సీఈవో చంద్ర నాయక్‌కు స్థానిక అధికారులు, పాఠశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

