- టీచర్స్ ఓట్ల కొనుగోలు ప్రారంభం
- గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం అభ్యర్థుల బేరసారాలు
నిజామాబాద్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ నెల 27న జరుగనున్నా గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం ప్రచార పర్వం ముగింపునకు వచ్చింది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికలలో కార్పొరేట్ రంగంలో ప్రధానంగా బిజినెస్ రంగంలో ఉన్న వ్యక్తులు బరిలో ఉండడంతో కరీంనగర్ శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ తరపున బరిలో నిలిచిన వారు కోటిశ్వరులు కావడంతో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కోటిశ్వరులు పార్టీలో టికెట్లు దక్కించుకుని కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఒక పార్టీకి చెందిన విద్యావేత్త, మరో రాజకీయ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థి తమకు చేతనైంతన పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గంలోనే ఓటర్లకు తాయిలాల పంపిణీ జరుగుతుందనుకుంటే అంతకు మించి టీచర్ ఎమ్మెల్సీ పోస్టు కోసం కూడా అభ్యర్థులు డబ్బును నీళ్ళప్రాయంలా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ వారి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి, వ్యాపార రంగంలో ఉన్న మరో టీచర్ అభ్యర్థి ఖర్చుకు వెనక్కి తగ్గడం లేదని తెలిసింది.
కరీంనగర్,నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఓటర్లు నాలుగు జిల్లాల్లో 3,55,159 పైచిలుకు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీకి వస్తే 27,088 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్లు 55కు పైగా అభ్యర్థులు బరిలో ఉండగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది పోటీలో నిలిచారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీల అభ్యర్థులు పంపకాల వ్యవహరంలో వెనక్కి తగ్గడం లేదని చర్చ జరుగుతుంది. వారిద్దరికి ఏమి తీసిపోనట్లు కుల ప్రాతిపదికన ఓట్లను అడుగుతున్నా మరో విద్యావేత్త ఇద్దరంతా ఇచ్చుకోలేను కానీ తన స్థోమతను బట్టి ఇస్తామని చెప్పడం విశేషం. మాజీ ప్రజాప్రతినిధి సైతం తన స్థాయిని బట్టి ఓటర్లకు తాయిలాల పంపిణీకి రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఇద్దరు కార్పొరేట్ సెక్టార్ కు చెందిన నాయకులు కూడా ఓటుకు నోటు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం పై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఓటుకు 5 వేలు ఇచ్చేందుకు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా పార్టీల తరపున అగ్రనేతలను ప్రచారానికి తిప్పిన నాయకులు గడువు ముగియకముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిసింది. ఈ నెల 27న ఎన్నికలు ఉండగా అంతకు ముందు మహాశివరాత్రి ఉండడంతో ముందుగానే ఓటర్లకు తాయిలాల పంపిణీకి రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఓ పార్టీ నాయకుడు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా ప్రకారం డివిజన్ లలో, గ్రామాలలో సంబంధిత పార్టీ కార్యకర్తల ద్వారా నేరుగా ఓటర్లకే కాసుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.మరో పార్టీ నాయకుడు ఆలస్యంగా ప్రచారం ప్రారంభించగా అభ్యర్థులకు నేరుగా యూపీఏల ద్వారా చెల్లింపులు చేస్తారని ప్రచారం ఊపందుకుంది. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కోటిశ్వరులు కావడంతో ఈసారి సర్కారు టీచర్ల పంట పండినట్లేనని చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయ ఓటు కోసం ఒక్కొక్కరికి రూ.5 వేలు తక్కువ కాకుండా పంపిణీ చేస్తారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూనియన్ల సమావేశాలతో పాటు విందులు జోరుగా సాగుతున్నాయి. రేపు, ఎల్లుండి తాయిలాలు ఓటర్లకు పంపిణీ ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఓ యూనియన్ అభ్యర్థి 23నుంచే ఒక్కో టీచర్ ఓటర్ కు రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. మండలానికి చెందిన అధ్యక్ష కార్యదర్శలు చేత పంపిణీ ప్రారంభించడం విశేషం. 26న మరో విడత ఓట్లకోసం పంపిణీకి వెనుకాడేది లేదని యూనియన్ నాయకుల వద్ద పేర్కొన్నట్లు ప్రచార జరుగుతుంది.