30 C
Hyderabad

వెట్టి చాకిరి విముక్తికి కులమతాలకతీతంగా పోరాటం

A struggle transcending caste and religion for liberation from bonded labor

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో రైతులకు లక్షల ఎకరాల భూ పంపిణీ

. . . సదస్సులో ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో దొరలు, భూస్వాములు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌ల అరాచకం కొనసాగిందని ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలు, రైతులు సాయుధులై తిరగబడి పోరాటం చేశారని అన్నారు. కులమతాలకు అతీతంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లక్ష్యాలు–నేటి పరిస్థితి’ అనే అంశంపై నగరంలోని పెన్షనర్స్ భవన్‌లో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ మాట్లాడుతూ అప్పట్లో నిజాంతోపాటు భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉండేదన్నారు. ఆ భూముల్లో పనిచేసేందుకు ప్రజలను, రైతులను వెట్టి చాకిరీకి ఉపయోగించుకునేవారని తెలిపారు. వెట్టి చేయబోమని ఎదురు తిరిగిన వారిపై తీవ్రంగా దాడులు చేసేవారని గుర్తుచేశారు. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో దొరలపై తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న గుడిసెలు, కారం పొడి, చీపురు కట్టలు వంటి వాటితో పాటు సుమారు 10 వేల మందికిపైగా రైతులు, ప్రజలు తుపాకులు చేతబట్టి సైన్యంగా ఏర్పడి పోరాటం చేసినట్టు తెలిపారు. ఈ పోరాటంలో సుమారు 400 మంది ప్రజలు చనిపోయారని చెప్పారు. ఈ పోరాటం ఫలితంగా ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదం వచ్చిందని, ఈ క్రమంలో 10 లక్షల ఎకరాలకు పైగా భూమిని రైతులకు కమ్యూనిస్టులు పంపిణీ చేశారని తెలిపారు.ఈ పోరాటంలో అనేక మంది ముస్లింలు సైతం ప్రాణాలు కోల్పోయారని, ప్రముఖులుగా షోయబుల్లాఖాన్, షేక్ బందగీ వంటి వారు ఉన్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా స్వేచ్ఛ కోసం ప్రజలు పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వేచ్ఛ కోసం నాడు జరిగిన పోరాటం తర్వాత కూడా సమసమాజం ఏర్పడలేదన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందని పరిస్థితి ఉందని తెలిపారు. డబ్బున్న వారికి ఒక న్యాయం, డబ్బు లేని వారికి మరో న్యాయం అన్నట్టుగా వ్యవస్థ మారిందని విమర్శించారు. చివరకు దేవుడి వద్ద కూడా వివక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. సమాన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు అధ్యక్షత వహించగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఈవీఎల్ నారాయణ, శిర్ప హనుమాన్లు, ప్రసాద్, సాంబశివరావు, సిర్ప లింగయ్య ఆలపించిన పాటలు శ్రోతలను అలరించాయి.

A struggle transcending caste and religion for liberation from bonded labor
 

More articles

Latest article