ఎల్లారెడ్డి, బతుకమ్మ :
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజాల్ 400 మి.గ్రా. మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజాల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక ఆల్బెండజాల్ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ మాత్ర ద్వారా నులిపురుగులు నిర్మూలించబడటంతో పాటు శరీరానికి పోషకాలు సక్రమంగా అందడం, రక్తహీనత తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, విద్యార్థుల్లో చదువుపై ఏకాగ్రత మెరుగుపడడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజాల్ మాత్ర వేయించి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఆల్బెండజాల్ మాత్రలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు పొడవుగా పెంచుకోకుండా ఉండడం, ఎల్లప్పుడూ చెప్పులు ధరించడం వంటి అలవాట్లను విద్యార్థులు అలవరచుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, తిరుపతి, గఫార్, చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు, రఫీఖ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఏఎన్ఎం సుధారాణి, అంగన్‌వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
