- విదేశాల నుంచి హవాలా డబ్బు వచ్చిందని అనుమానంతో ఖాతాలు ఫ్రీజ్
- జిల్లా వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో అకౌంట్ ఫ్రీజ్ కేసులు నమోదు
నిజామాబాద్, బతుకమ్మ : స్వంత ఊరిలో పని దొరకక పుట్ట కూటి కోసం సప్త సముద్రాలు దాటి విదేశాలలో పని చేస్తున్న ప్రవాస భారతీయుల అక్కడి తిప్పలు అక్కడ వేరు ఉన్నప్పటికీ సాధక బాధకలు భరిస్తూ పని చేస్తే వచ్చిన జీతాన్నీ కుటుంబ సభ్యుల కు పంపిన తర్వాత అకౌంట్‌లో జమ అయినా సరైన ఆధారాలు లేకుంటే ఖాతాలు స్తంభించే పరిస్థితి నెలకొంది.వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో ఆ మొత్తాలు జమ కాగానే సైబర్ క్రైమ్ విభాగం రంగంలో దిగి సరైన ఆధారాలు లేకుండా డబ్బు లావాదేవీ జరిగిందని అనుమానిస్తూనే విచారణ ప్రారంభమయ్యేలోపే అకౌంట్లను ఫ్రీజ్ చేస్తుంది.
నిజామాబాద్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలు ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గంగామణి అనే మహిళకు ఆమె భర్త దుబాయ్ నుంచి డబ్బు పంపిన డబ్బులు ఖాతా లో జమ అయినట్టు టింగ్ టింగ్ మెసేజ్ రాగానే సంతోషించి మరుసటి రోజు బ్యాంక్‌లో నగదు తీసుకోవడానికి వెళ్ళిన ఆమెకి ఖాతా నిలిపివేయబడింది అనే సమాధానం లభించడంతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. “నా భర్త కష్టపడితే మా కుటుంబం బతుకుతుందనుకుంటే ఇదెక్కడి న్యాయం ? అని కన్నీళ్లు పెట్టుకుంది.
- ఎందుకు ఫ్రీజ్ అయ్యింది?
దుబాయ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న గంగామణి భర్త తన స్నేహితుడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. గంగామణి భర్త తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అందుకునే సమయంలో స్నేహితుడు ప్రత్యక్షంగా పంపించకుండా ఇండియాలో ఉన్న మరో మద్దతుదారుడి ఖాతా ద్వారా ఆమె ఖాతాలోకి జమ చేయించాడు. ఇది హవాలా లావాదేవీ అని అనుమానం కలగడంతో సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతా ఫ్రీజ్ చేయించింది.తను అమాయకురాలు ఎలాంటి తప్పు చేయలేదు కానీ ఎవరో చేసిన తప్పుకు నా ఖాతా ఆపేయడం ఏంటి ? అని ఆలోచిస్తూ ఆమె మానసిక శిక్ష గురి అయింది.
- సైబర్ క్రైమ్ కార్యాలయానికి క్యూ..
నిజామాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ప్రతిరోజూ చాలా మంది తమ ఖాతాల గురించి విచారించేందుకు వెళుతున్నారు. అకస్మాత్తుగా ఖాతా ఫ్రీజ్ కావడంతో ప్రజలు సైబర్ క్రైమ్ కార్యాలయనికి వెళ్లి తమ అకౌంట్ స్టేటస్ చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
- హవాలా డబ్బు: గల్ఫ్ నుంచి భారీగా నగదు ప్రవాహం..
గల్ఫ్ దేశాల నుంచి హవాలా మార్గంలో భారీగా నగదు నిజామాబాద్ జిల్లా లో ప్రవహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులు అక్రమ వ్యాపారాలకు ముడిపడి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వనీయ సమాచారం మేరకు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు కొనసాగుతున్నాయనీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికులు అక్కడి మనీ ఎక్సేంజ్ లకు వెళ్లి పంపే బదులు తమ క్యాంప్ ల వద్ద ఉండే హవాలా ఏజెంట్ ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు పంపుతున్నారని ప్రభుత్వం పసిగట్టి హవాలా ను పూర్తి గా నిర్మూలించడానికి సైబర్ క్రైమ్ విభాగం ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. అధికారులు హవాలా ముఠాల పనితీరును గమనించి నిఘా పెంచారు. ముఖ్యంగా గల్ఫ్ నుంచి వచ్చే నగదు చలామణిపై కఠిన నియంత్రణ విధించాలని ఆర్థిక నేర విభాగం ఆలోచిస్తోంది.
- ప్రవాసీయులారా జాగ్రత్త సుమ..
ప్రస్తుతం విదేశాల్లో పని చేసే వేలాది మంది ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) తమ సంపాదనను కుటుంబ సభ్యులకు పంపించేటప్పుడు సరైన మార్గాలను పాటించకపోతే వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశాల్లో పని చేసే వేలాది మంది భారతీయులు “సులభమైన మార్గాల” పేరుతో నకిలీ ఎజెంట్ల ద్వారా డబ్బును పంపిస్తుండటంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం పెరిగింది.
- ప్రభుత్వ అనుమతితో ఉన్న విదేశీ ఎక్స్ఛేంజ్ సేవలను వినియోగించుకోవాలి
- బ్యాంక్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నందిపేట్.
మా బ్రాంచ్‌లోనే రోజుకు చాలా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎక్కువగా విదేశాల నుంచి మూడో వ్యక్తుల ద్వారా డబ్బు రాగానే సైబర్ క్రైమ్ విభాగం అనుమానాస్పదంగా గుర్తించి దర్యాప్తుకు ప్రారంభించి మొదటి క్షణం బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేస్తుంది. ప్రజలు డబ్బు పంపేటప్పుడు ప్రభుత్వ అనుమతితో ఉన్న విదేశీ ఎక్స్ఛేంజ్ సేవలను మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే వారి ఖాతా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది.
