నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
స్థానిక ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు టౌన్ – 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ ప్రాంతంలో ఏసీపీ ఆధ్వర్యంలో, సబ్ డివిజనల్ అధికారులతో కలిసి శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, మొత్తం 52 మోటార్ సైకిళ్లు, 12 ఆటోలు, ఒక టాటా ఏస్ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఈ – చలానాల రూపంలో రూ.18 వేలు వసూలు చేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ, నేరాల గుర్తింపు, నిందితుల పట్టివేతతో పాటు ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని వివరించారు. సమాజం లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ – 100 కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సుమారు 100 మంది స్థానిక ప్రజలు పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు.

