- ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ వెల్లడి
నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు -2025 పై శుక్రవారం అభిప్రాయ సేకరణ జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, విత్తన డీలర్లు, కంపెనీలు, విత్తన ఉత్పత్తిదారులతో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముసాయిదా విత్తన బిల్లులోని అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను సేకరించారు. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన నాసిరకం విత్తనాల కారణంగా పంట ఉత్పత్తి, విక్రయ దశలో రైతులకు నష్టం కలిగితే నిర్ణీత కాల పరిమితితో రైతులకు చట్టబద్దంగా నష్ట పరిషారం అందించేలా నిబంధనలపై చర్చించారు. విత్తన ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి స్పష్టమైన, సమర్ధవంతమైన నియంత్రణ వ్యవస్థను బిల్లులో చేర్చడం, పత్తి, వరి, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయలు తదితర విత్తనాల ఉత్పత్తి, విక్రయ ధరల నియంత్రణ కోసం నిబంధనలు, విత్తన విక్రయదారుల లైసెన్సింగ్ వ్యవస్థ, మార్గదర్శకాలు, సీడ్ టెస్టింగ్, విత్తనాల దిగుమతి, విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల నియంత్రణలో ఉన్న లోపాల సవరణ తదితర అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ముసాయిదా విత్తన బిల్లుపై సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
