. . జూన్ 28లోపు రూ. 1320 కోట్లు కట్టకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్ గా చూపుతామని ఆర్.ఈ.సి సంస్థ చెప్పింది
. . . చంద్రబాబు కు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారు
. . . కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారు
. . . జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైద్రాబాద్, బతుకమ్మ :
పద్దెనిమిది నెలల పరిపాలన లో రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. 2లక్షల కోట్ల రూపాయల అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం హైద్రాబాద్ లోని తన నివాసంలొ కవిత విలేఖరులతో మాట్లాడుతూ…. మేము అప్పులు తెచ్చి కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రెండు లక్షల కోట్లు అప్పులు చేసినా పింఛన్లు ఇవ్వడం లేదు, మహాలక్ష్మి పధకం అమలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఆర్.ఈ.సి వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారు. తెచ్చిన అప్పులను కేసీఆర్ తిరిగి కట్టారు. ఆర్.ఈ.సి సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్.ఈ.సి సంస్థకు మీరు కట్టాల్సిన డబ్బులు కట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి 2024లో లేఖ రాశారు. జూన్ 28లోపు కట్టాల్సిన 1320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని ఆర్.ఈ.సి సంస్థ మరో లేఖ రాసింది. లేకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్ గా చూపుతామని ఆర్.ఈ.సి సంస్థ లేఖ రాసీందన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మెగా,పొంగులేటి కంపెనీలు దక్కించుకోగా, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకముందే కంపెనీలకు అడ్వాన్స్ లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తు రేవంత్ రెడ్డి అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్ ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పంచుతాము అన్నారు. జూలై 6వ తేదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి సంవత్సరం అవుతుంది. రేవంత్ రెడ్డి,చంద్రబాబు భేటీ తర్వాతే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారు. మెగా కంపెనీకి లబ్ది చేసేందుకు బనకచర్లను కడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారు అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారు అని కవిత పేర్కోన్నారు. భద్రాచలం రాముడు మునుగుతున్నా తెలంగాణలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడంలేదు. భద్రాచలం దగ్గర ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి అని డిమాండ్ చేశారు.
