- ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
- అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం
- కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాను కుంభ వ`ష్టి అతలాకుతలం చేసింది. కామారెడ్డి జిల్లా చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో సాధారణ సగటు వర్షపాతాన్ని మించి వాన కురిసింది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం మొదలైన వాన గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పోచారం, కళ్యాణి, కౌలాస్ నాలా ప్రాజెక్టులు నిండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టుకు ఇటీవల డ్యాం వద్ద మట్టికట్ట కోతకు గురైన లక్ష క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులడంతో నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, పోతంగల్, సాలురా, బోధన్ మండలాల్లోని మంజిరా పరివాహక ప్రాంతాలు ముంపు ముప్పుకు గురయ్యాయి. బుధవారం వినాయకచవితి రోజున కామారెడ్డి జిల్లాలో చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. వారిని ఎస్ డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం రికార్డులను బద్దలు కొట్టింది. కుంభవ`ష్టి అనే కంటే క్లౌడ్ బరెస్ట్ అని ఇటీవల చెబుతున్న పదానికి పర్యాయ పదంగా వర్షం దంచికొట్టింది. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆర్గొండలో 44 సెం.మీ వర్షం నమోదైంది. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 33 సెం.మీ వర్షం నమోదైంది. తాడ్వాయిలో 30 సెం.మీ, బిక్కనూర్ లో 27 సెం.మీ, లింగంపేట్ లో 23 సెం.మీ, దోమకొండలో 20, పాతరాజంపేట్ లో 25, మాచారెడ్డి, రామారెడ్డిలో 19, పాల్వాంచ మండలం ఎలుపుగొండ, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్ లో 18, పాల్వాంచలో 17, గాంధారి మండలం రామలక్ష్మణ్ పల్లిలో 16, నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లిలో 17 సెం.మీ, గాంధారి మండలం సర్వాపూర్ లో 13, ఎల్లారెడ్డి మాచాపూర్ లో 13, బీబీపేట్ లో 12, మహ్మద్ నగర్ మండలం ముగ్ధంపూర్ లో 11 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో నస్రుల్లాబాద్ మండలంలో 5.5 మి.మీ వర్షం కురిసింది.
కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేయడంతో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధం గురైన ప్రాంతాలను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, స్థానిక ఎమ్మెల్యేలు మధన్ మోహన్ రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు, జిల్ల కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. కామారెడ్డి, మెదక్,పెద్దపల్లి, సిద్దిపేట్ లలో భారీ వర్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షించాల్సిన సీఎం వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మెదక్ జిల్లాకు వెళ్లారు. అనంతరం సిద్దిపేట్ కలెక్టరేట్ నుంచి నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

