- పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి. పరీక్షా కేంద్రాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం ల నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి అందుబాటులో ఉందా? లేదా? అని

గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా, పక్కాగా పరీక్షలు జరిపించాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 22,774 మంది విద్యార్థిని, విద్యార్థులకు గాను తొలి రోజున 22,715 మంది పరీక్షకు హాజరయ్యారని, 59 మంది గైర్హాజరు అయ్యారని కలెక్టర్ వివరించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులకు గాను, 12,552 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, 27 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు.
