- దోపిడిని ప్రశ్నిస్తే తొలగింపు
- డిపాజిట్లు అడిగితే బెదిరింపు
- అక్రమాలపై బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు
నిజామాబాద్, బతుకమ్మ:
బీడీ ఖార్ఖానా పెట్టుకొని బ్రతుకును సాగిద్దామని అనుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం డిపాజిట్ పెట్టాడు. కొత్తలో ప్రోత్సహించడంతో చురుకుగా వ్యాపారం చేసాడు. రోజులు గడుస్తున్నాయి.. బీడీ వ్యాపారంలో దోపిడి మితిమిరుతోంది. కార్మికుల శ్రమకు వేతనాలు, ఆకు, తంబాకు సమపాళ్ళలో ఇవ్వాలని కంపెనీకి సూచించాడు. అంతే .. భాదిత మహిళల తరపున అడిగిన పాపానికి, ఏజెంట్ గా వద్దని నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. రెండు బ్రాంచ్ లలో పెట్టిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిజమాబాద్ లో ఏళ్ల క్రితం నెలకొల్పబడిన చార్ బాయి బీడీ కంపెనీపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసాడు. అందులో(ఫిర్యాదు) పొందుపరిచిన సారాంశాలు ఇలా ఉన్నాయి.
- అడిగినందుకే…
ఖానాపూర్ బ్రాంచ్ కోసం రూ.1,93,142, గాజుల్ పేట్ కోసం రూ. 2,10,354 డిపాజిట్ చేసాడు. రెండు ప్రాంతాల్లో నడిపిస్తూ కంపెనీ ద్వారా ఇచ్చే తునికాకు, తంబాకు, ముడి సరుకు ఇచ్చి కార్మికులు ద్వారా తయారుచేయించిన బీడీలను నడిపెల్లి కేంద్రానికి బీడీలను ముట్టజెప్పేవారు. కార్మికులు కష్టపడి తయారు చేసిన బీడీల వివరాలను ప్రతి నెల కంపెనీ పి.ఎఫ్. ఇన్పుట్ లో రాసాడు. దీని ప్రకారం పి.ఎఫ్. పేమెంట్ షీట్ ప్రకారంగా బీడీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వారి కష్టార్జితమైన కూలీ డబ్బులను యాజమాన్యం జమ చేసింది. దీనికి సంబంధించిన నెలసరి పి.ఎఫ్.చెల్లింపు జాబితా, బీడీ కార్మికుల సంతకాలతో కూడిన ప్రతులను నడిపెల్లి కేంద్రం మేనేజర్ కు అందజేశాడు. ఖానాపూర్, గాజుల్పేట్ శాఖలలోని బీడీ కార్మికులందరికి కనీస వేతనాల చట్టం ప్రకారంగా వేతనాలు చెల్లించేలా చేయడంతో యాజమాన్యానికి కొరకరానికొయ్యలా మారాడు. ప్రతి నెలలో చేసిన చాటన్ బీడీకి కూలీ, వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తునికాకు ఇవ్వాలని నడిపెల్లి కేంద్రం నిర్వాహకున్ని అడిగినందుకు, ఉద్దేశపూర్వకంగా ఖానాపూర్, గాజుల్ పేట్ కమిషన్ ఏజెంట్ కాంట్రాక్టర్ ను తొలగించారు.
- జాడలేని కనీస వేతన చట్టం….
కనీస వేతనాల చట్టం ప్రకారంగా మాస్టర్ రోల్, లాంగ్ బుక్ లు అందుబాటులో ఉంచడం లేదు. కమిషన్ ఏజెంట్లు టేకేదార్ల ద్వారా బీడీ కార్మికుల శ్రమను చాటన్ పేరుతో పరోక్ష శ్రమ దోపిడీని చేయిస్తున్నారు. నెలలో ఒక్క రోజు వెట్టిచాకిరీకి మహిళా బీడీ కార్మికులు లోనవుతున్నారు. చార్ బాయి బీడీకి సంబందించిన కేంద్రాలలో (సెంటర్లల్లో), శాఖలలో (బ్రాంచుల్లో) నిర్వహణ, కమిషన్ ఏజెంట్లు చేస్తున్న శ్రమ దోపిడీపై సంబంధిత శాఖాధికారులతో బహిరంగ విచారణ జరపాల్సిన అవసరముంది. మహిళా బీడీ కార్మికులను చాటన్ బీడీశ్రమ దోపిడీ, నెలలో ఒక్క రోజు శ్రమ దోపిడీ నుంచి బీడీ కార్మికులకు విముక్తి కల్పించి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కనీస వేతనాలు ఇప్పించాలనే డిమాండ్ కార్మికుల నుంచి వస్తోంది.
- అంగట్లోకి చాట బీడి …
కాంట్రాక్టర్ కమిషన్ ఏజెంట్ ప్రతి నెల ఖానాపూర్, గాజుల్పేట్ బ్రాంచుల ద్వారా నడిపెల్లి కేంద్రానికి ముట్టజెప్పిన అసలు బీడీ మొత్తంలో నుంచి ప్రతి నెల ఒక్కొక్క బ్రాంచ్ కు సుమారు 25 వేల నుంచి 40 వేల బీడీల వరకు యాజమాన్యం ఆధ్వర్యంలో మేనేజర్ ఉద్దేశపూర్వకంగా మంచి బీడీలను చాట్ చేశారు. ఇలా చేసిన బీడీలకు కంపెనీ కూలీ ఇవ్వకపోవడంతో దీని కారణంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. చాట్ బీడీకి పి.ఎఫ్. కట్టడం లేదు పైగా దీనిని అంగట్లో విక్రయించి కంపెనీ సొమ్ము చేసుకుంటుంది.
- అన్ని కేంద్రాలలో అంతే …
చార్ బాయి కంపెనీ ఆధ్వర్యంలో నడిపెల్లి, ధర్పల్లి, బాబా నగర్, మోర్తాడ్, బాన్సువాడ, నీలా, సాంగి, ముధోల్, వరోలి, మల్యాల్, నేరేడిగొండ, బోథ్, ఇందన్వెల్లి, సిరిసిల్లా తదితర కేంద్రాలలో గల శాఖలలో అసలు దానిలో నుంచి బ్రాంచ్, సెంటర్ చాట్ బీడీ పోను మిగతా వాటి మొత్తానికి మాత్రమే కనీస వేతనాలను చెల్లిస్తున్నారు. ధనార్జనే ద్యేయంగా కమిషన్ ఏజంట్ల ద్వారా చాట్ చేసి కార్మికుల శ్రమ దోపిడికి కంపెనీ గురి చేస్తుంది.
- విచారణ చేపడితే …
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ సంబంధిత అధికారులతో బహిరంగ విచారణ జరిపిస్తే బీడీ కార్మికుల శ్రమ దోపిడీ బహిర్గతం అవుతుంది. కంపెనీ ముడిసరుకైన తునికాకు, పొగాకు, దారం, కంపెనీ కేంద్రాల వారీగా, శాఖల వారీగా కార్మికులకు ప్రతి నెలలో ముడిసరుకు ఇచ్చి బీడీలను తయారు చేయించి, లాంగ్ బుక్స్, మాస్టర్ రోల్ పొందుపరిచిన వాటిని తనిఖికి వచ్చిన వారు పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయి. రాష్ట్ర, కేంద్రం జి.యస్.టి., పి.ఎఫ్ బీడీ, చాటన్ బీడీల లెక్కలపై ఐ.టి, అటవీ, సెంట్రల్ ఎక్సైజ్ సంబంధిత శాఖాధికారులు విచారణ జరిపిస్తే కార్మికుల శ్రమ, నెలలో ఒకరోజు వెట్టి చాకిరి బహిర్గతం కానుంది. కార్మిక శాఖాధికారులు స్పందించి తానూ పెట్టిన డిపాజిట్ డబ్బులను ముందుగా ఇప్పించాలని కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు శ్రీనివాస్ కోరుతున్నాడు.
