నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టి మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా నగరానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో సన్మాన సభను ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా పై అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ బొమ్మాళి అరవింద్ అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ.హుస్సేన్ స్టేజ్ పాస్ లేకుండానే స్టేజీ పైకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ బొమ్మాళి అరవింద్ స్టేజీ పాస్ లేనిదే పైకి అనుమతి లేదని హుస్సేన్ ను అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సన్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని విధులకు ఆటంకం కలించారు. దీంతో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
