29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థుల సమయానుకూలంగా బస్సులు నడపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

డిచ్‌పల్లి మండలంలోని ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అలాగే నవీపేట్ మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాల, పాఠశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.నసీర్ మాట్లాడుతూ, ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కళాశాల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆ మార్గంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 7.30 గంటలకే రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు రెండు గంటల ముందుగానే కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని, కొంతమంది బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అదేవిధంగా, నవీపేట్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు నవీపేట్ బస్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలంలో బాలికలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం కళాశాల సమయాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపడంతో పాటు, నవీపేట్ మోడల్ స్కూల్ రోడ్డులో ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను పీడీఎస్ యు నాయకులు కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు రేహాన్, భాను, శ్రీశాంత్, రోహన్, నాగేశ్వరి, అఖిల తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article