. రాజ్యసభ, శాసన మండలి సభ్యత్వాలతోపాటు ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చాం
. పదేళ్లలో బీసీల కోసం రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం
. కులవృత్తులను బలోపేతం చేస్తే కొందరు ఎగతాళి చేశారు
. ఈ పదిహేను నెలల్లో కులవృత్తులు కుదేలయ్యాయి
. బీసీ రౌండ్ టేబుల్ సమేవశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కామారెడ్డి, బతుకమ్మ: బీసీ నాయకత్వాన్ని తమ పార్టీ బీఆర్ఎస్ బలోపేతం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బీసీ నాయకత్వం బలపడడానికి బీఆర్ఎస్ ఐదుగురిని రాజ్యసభకు పంపించడంతోపాటు 8 మందిని ఎమ్మెల్సీలను చేసిందని, 58 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చి పెద్దపీట వేసిదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి గతంలో ఎప్పడూ బీసీలకు దక్కలేదని, మొట్టమొదటి సారి రవీందర్ యాదవ్ ను కేసీఆర్ వీసీ చేశారని, అలాగే అడ్వొకేట్ జనరల్ గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో బీసీలకు లక్షా 55 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని, కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంత మంది ఎగతాళి చేశారన్నారు. కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా రాష్ర్ట బీజేపీ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. గ్రామాలు, కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలను బయటపెట్టాలన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ తమ పోరాటం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందన్నారు. రాష్ట్రంలో 50 శాతం పరిమితి మించింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు.
బీఆర్ఎస్ బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసింది
