25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్‌వాడీ కేంద్రాల్లో వెలుగులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరు నెలల్లో 9,800 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) చొరవతో గత ఆరు నెలల్లో 9,800 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇది దాదాపు 90 శాతం విద్యుదీకరణ పూర్తయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే విద్యుత్ సౌకర్యం కల్పించి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో రాష్ట్రంలోని సుమారు 40 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడం వల్ల వేసవి కాలంలో పిల్లలను కేంద్రాల్లో ఉంచడం కష్టంగా మారేదని, అలాగే డిజిటల్ బోధనకు కూడా విద్యుత్ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా కల్పించాలని మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను గుర్తించి వేగంగా విద్యుదీకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11,194 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించగా, అందులో 9,800 కేంద్రాలకు గత ఆరు నెలల వ్యవధిలోనే కనెక్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చిన్నారులు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదగడం ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలో విద్యుత్ సౌకర్యం అందించి రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం విద్యుదీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. అదే సమయంలో గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. గత పాలకులు “బంగారు తెలంగాణ” పేరుతో ప్రచారం చేసినప్పటికీ వేలాది అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.

 

Bringing Light to Anganwadi Centers

More articles

Latest article