. . . కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
కామారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రైతులు, గిరిజనులు, గ్రామ పంచాయతీలు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర సమస్యల పరిష్కారం కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 268, మల్తుమ్మెద గ్రామంలోని సర్వే నంబర్లు 834, 838 భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటివరకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గండివేట్ తండా, హేమ్లా నాయక్ తండా, వెంకటాపూర్ తండా తదితర గిరిజన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత భూములపై సమగ్ర పరిశీలన నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం వల్ల సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యవసరంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాల అభివృద్ధికి ప్రతి మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి గోదాముల నిర్మాణానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలో సమీకృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణానికి 20 ఎకరాలు, మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. అదేవిధంగా బొల్లారం గ్రామంలోని రాము తండా నుంచి లింగోజిపల్లి పోచమ్మ ఆలయం వరకు మెటల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను జిల్లా కలెక్టర్ సానుకూలంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభిస్తామని, త్వరలోనే అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
