. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పుడి రవి కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న జూనియర్ కళాశాలల అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఈ పథకాన్ని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం జిల్లా ఇంటర్ విద్యా అధికారి నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజు అధ్యక్షతన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థినులకు విశేష ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. జిల్లాలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన ఈ కళాశాల మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే అధిక సంఖ్యలో అడ్మిషన్లు నమోదైన నేపథ్యంలో, విద్యార్థులకు వెంటనే తరగతులు ప్రారంభించి నాణ్యమైన విద్య అందించాలని అధ్యాపకులకు సూచించారు. అలాగే సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విద్యార్థినికి మంచి భవిష్యత్తు నిర్మించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడం, ఈ విద్యా సంవత్సరంలో గణనీయమైన అడ్మిషన్లు నమోదు చేయడం పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఇదే సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి నిజామాబాద్ బాలుర (ఖిల్లా) ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి కళాశాల నిర్వహణ, విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
