ఎల్లారెడ్డి, బతుకమ్మ: చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఆబేద్ హుస్సేన్ ఈనెల 19న తన బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లాడు. 20న తన ఏటీఎం నుండి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసినట్లుగా అతనికి మెసేజ్ వచ్చింది. దీంతో ఎల్లారెడ్డి లోని తన ఇంటికి వచ్చి చూడగా ఇంటికి గల తలుపులు పగలగొట్టి ఇంట్లోని బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని కొంత నగదు, ఏటీఎం కార్డు దొంగలించబడినట్లు గుర్తించాడు. ఆ ఏటీఎం కార్డు ఉపయోగించి దొంగలు కొంత డబ్బును డ్రా చేశారు. ఆబెద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారిలో ఒకరు గతంలో కొన్ని దొంగతనాలు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న మెదక్ జిల్లాలోని తొగిట గ్రామానికి చెందిన మాచబోయిన మహేష్, అతనితోపాటు నాగిరెడ్డిపేట మండలం లొంకలపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అనే ఇద్దరు విచారణలో వారు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడంతో వారిని ఎల్లారెడ్డి లోని కోర్టు నందు హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని జైలుకు తరలించారు.