. . . అంగన్ వాడి టీచర్‌తో అసభ్య ప్రవర్తనపై పార్టీ నిర్ణయం
జగిత్యాల, బతుకమ్మ :
అంగన్వాడీ టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదులపై బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌ను రాష్ట్ర పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.ఈ ఘటనపై జిల్లా బీజేపీ అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేయగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ తదితరులు సెప్టెంబర్ 11న బాధిత అంగన్వాడీ టీచర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాధిత అంగన్వాడీ టీచర్‌తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసి, ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఘటనకు సంబంధించిన వార్తలు ప్రింట్, సోషల్ మీడియాలో రావడంతో పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగిందని రాష్ట్ర పార్టీ పేర్కొంది. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు విచారణ పూర్తయ్యే వరకు కొక్కు గంగాధర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏడు రోజుల్లోగా తన వివరణను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించింది.కాగా, ఈ వ్యవహారంలో ఎంపీ అరవింద్ “తగ్గేదేలే” అన్నట్టుగా వ్యవహరించారని, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తి పట్టణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలను ఎలా నిర్వహించగలమనే విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అదేవిధంగా, బాధిత అంగన్వాడీ టీచర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకున్నారనే వార్తలు కూడా అర్వింద్ ఆగ్రహానికి మరింత కారణమయ్యాయని సన్నిహితుల సమాచారం.ఏదేమైనా, పార్టీ క్రమశిక్షణ విషయంలో తాను రాజీపడేది లేదని, పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోననే స్పష్టమైన సంకేతాలను ఎంపీ అరవింద్ మరోసారి ఇచ్చారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
