నగల చోరికి పాల్పడి పరారైన దుండగుల బైక్ ధర్మపురిలో లభ్యం

0 9,713

 

. . . పియంజే కేసులో కీలకమైన బైక్ స్వాధీనం

 

. . . ఆగంతకులు సరిహద్దులు దాటారని అనుమానాలు

 

కరీంనగర్, బతుకమ్మ :

 

కరీంనగర్ పియంజె జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తులో పోలిసులకు కీలక పురోగతి లభించింది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తో పాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు, గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈనెల 3న కరీం నగర్ జిల్లా కేంద్రంలోని పియంజే జ్యూవలరీ షాపులో ఐదుగురు ఆగంతకులు చోరికి పాల్పడిన విషయం తెలిసిందే. నగల షాపులో సిబ్బందిపై కాల్పులు జరిపి కిలోన్నర బంగారు ఆభరణాలతో రెండు బైక్ ల పై పరారీ అయిన విషయం తెలిసిందే. ఒక పల్సర్ బైక్ పై ముగ్గురు, అపాచీ బైక్ పై ఇద్దరు పరారీ అయిన సీసీ టీవి పుటేజీని రాజీవ్ రహదారిపై గుర్తించిన విషయం విధితమే. పీయంజే జ్యూవలరీ షాపులో జరిగిన చోరిని పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 12 టీంలతో ఆనాటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆగంతకులు చిక్కలేదు. అందులో ఒక పల్సర్ బైక్ గోదావరి తీరంలో దొరకడంతో వారు నదిదాటి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒక బైక్ దొరకగా, మరో బైక్ సమీపంలో ఎక్కడైనా వదిలేసీ ఇతర వాహనాలలో రెండు రాష్ట్రాల సరిహద్దు గుండా పరారీ అయ్యారనే కోణంలో పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్ రాష్ట్ర సభ్యుల ముఠా తుపాకులతో కాల్పులు జరిపి నగలతో పరారీ కావడంపై ప్రతిపక్షాలు భధ్రత వైఫల్యాలపై దుమ్మెత్తిపోసాయి. డిజీపీ సివి ఆనంద్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పొరుగు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయంతో కేసును చేధించే పనిలో పడ్డారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సహయంతో నగల షాపు చోరి కేసును కొలిక్కి తెచ్చే పనిలో పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.