. . . బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్ కు కేటాయింపు
బిచ్కుంద, బతుకమ్మ:
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12వార్డులకు గాను రిజర్వేషన్ల వివరాలు ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారిలో ఆశలు చిగురించడంతో రిజర్వేషన్లు అనుకూలంగా రానివారు నిరాశతో భవిష్యత్తు వ్యూహం కోసం సిద్ధమవుతున్నారు. ఏ వార్డులో తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చింది? ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ పోటీ చేస్తే తమ విజయం ఖాయం? అనే లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏర్పాటు కావడం తదనంతరం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో మరో మారు ఎన్నికల వేడి కనిపిస్తోంది. పార్టీపరంగా జరిగే మున్సిపల్ వార్డు ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉండగా 12వేల 759 మంది ఓటర్లు ఉన్నారు. 6వేల 556 మంది మహిళా ఓటర్లు 6వేల 201 మంది పురుషులు ఉన్నారు.
రిజర్వేషన్లు ప్రకటనతో ముమ్మర ప్రయత్నాలు..
బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు చైర్మన్ స్థానం బిసి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో పోటి రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలో కూడా చైర్మన్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. చైర్మన్ పీఠం దక్కించుకునేది ఎవరో వేచి చూడాల్సిందే…
