29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తమ ఫలితాలకు మెరుగైన విద్యా బోధన

Must read

📰 Generate e-Paper Clip

  • పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్ధి కళాశాలల్లో చేరేలా చూడాలి
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ బడులు, కాలేజీలు, గురుకులాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యా శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీల నిర్వహణ తీరుతెన్నులు, గత సంవత్సరం సాధించిన ఫలితాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో హడావుడి పడకుండా ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తే, అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులతో, కాంప్లెక్స్ హెచ్.ఎం లతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ ప్రభుత్వ బడులలో కార్పొరేట్ కు దీటుగా విద్యా బోధన జరిగేలా చూడాలని జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను ఆదేశించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలల్లో చేరేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులలో చేరని వారిని గుర్తిస్తూ, ఒక్కో విద్యార్థి వారీగా పూర్తి వివరాలు సేకరించాలని, వారిని సంప్రదించి కాలేజీలలో ప్రవేశాలు పొందేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. ఆర్థిక పరిస్థితి, ఇతరాత్ర కారణాల వల్ల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలని అన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ జరిగాయని తెలిపారు నోట్ బుక్కులు కూడా 80 శాతం వరకు పంపిణీ అయ్యాయని మిగతా వాటిని కూడా జిల్లాకు కేటాయించబడిన వెంటనే విద్యార్థులకు ఆయా పాఠశాలల వారీగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక జత ఏకరూప దుస్తులు ఇప్పటికే విద్యార్థిని విద్యార్థులకు అందించామని, రెండవ జత యూనిఫామ్ లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని, అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఐఈఓ రవికుమార్, డీఈఓ అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు స్రవంతి, రజనీ, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Better teaching for better results

More articles

Latest article