. . . దశాబ్దాలు పసుపు రైతుల కల సాకారం చేసాను
. . . ఏడు ఆర్వోబీల నిర్మాణాలతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నాయి
. . . మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి
. . . పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కౌంటర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అభివృద్ధిపై ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పసుపు రైతుల కలగా ఉన్న జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డపై సాకారమైందని, దీనితో పసుపు ధరలు పెరిగి, పసుపు పంట పసిడి పంటగా మారే దిశగా చరిత్ర సృష్టిస్తోందన్నారు. ఏడు ఆర్వోబీల (మాధవ్ నగర్, మామిడిపల్లి, అడివిమామిడిపల్లి, అర్సపల్లి, గోవింద్‌పేట్, బోధన్ తదితర ప్రాంతాలు) నిర్మాణంతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నాయని, మహంతం, దర్యాపూర్, జానకంపేట ప్రాంతాల్లో ఆర్‌యూబీల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, అలాగే ముద్కేడ్ – డోన్ స్టేషన్‌ల మధ్య 418 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టుకు, పటాన్ చెరు – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, పనులు శరవేగంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, బోధన్- బాసర- భైంసా మార్గం ద్వారా నూతన జాతీయ రహదారి ఏర్పడిందని, అంతే కాకుండా వందల కిలోమీటర్ల మేర బోధన్- నిజామాబాద్, నిజామాబాద్ – ఆర్మూర్ మార్గాలలో రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సిఆర్ఎఫ్ లాంటి పథకాల ద్వారా 26 రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగే మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలను మన ప్రాంతానికి తీసుకురావడంతో వందలాది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని, మూడు కొత్త పోస్టాఫీసులు ఏర్పాటు చేయడంతో ప్రజలకు తపాలా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని, పీ ఎఫ్ కార్యాలయంలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయడం వలన, 28,000 పైగా బీడీ కార్మికుల వివరాలు సరి చేయబడినాయన్నారు. ఇందూరు పార్లమెంట్ ప్రజల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన “అర్వింద్ ఫర్ అస్” హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా గల్ఫ్ లో మృతి చెందిన 141 మృతదేహాలను, గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 508 మందిని స్వదేశానికి రప్పించడం జరిగిందని, పార్లమెంట్లో నేను మాట్లాడిన ఆపరేషన్ మలేషియా, ఆపరేషన్ మయన్మార్ ద్వారా వేల మందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకురాగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఇవే కాకుండా మౌలిక వసతులు, రవాణా, విద్య, వ్యవసాయం, తపాలా, వీధి వ్యాపారులకు , యువతకు ముద్ర లోన్లు , ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమాల ద్వారా వేలాది కోట్ల రుణాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలయ్యాయని, ఇవన్నీ రూపాయి కమిషన్ లేకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయన్నారు. ఈ పనులన్నీ కూడా గడిచిన 7 సంవత్సరాలలో జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్మూర్- ఆదిలాబాద్, బోధన్ బీదర్ రైల్వే లైన్ ల ఏర్పాటు, నిజామాబాద్ మీదుగా వందే భారత్ రైలు, ముద్ ఖేడ్- డోన్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తయిన వెంటనే ముంబై, ఢిల్లీకి మరిన్ని కొత్త రైళ్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఇవన్నీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు జరిగేది ఇంకా ఉందని వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి సూచించారు.
