బాన్సువాడ , బతుకమ్మ : బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగడాలు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం ఇచ్చారు. అరెస్టు చేసిన ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప ఆలయం నుంచి బైక్ ర్యాలీగా వెళ్లిన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద హిందువులు ఐక్యతగా ఉండాలని నినాదాలు చేశారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ శాంతిని కోరుకునే హిందువులపై దాడులను క్షమించరాని నేరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచాలని కోరారు. బంగ్లాదేశ్ విపత్తులో ఉన్నప్పుడు ఇస్కాన్ ప్రతినిధులు అక్కడ ఎన్నో సేవలు చేశారని, వారికి అన్న ప్రసాదం కూడా అందించారని, అన్నం పెట్టిన వారిని అరెస్టు చేయడం శోచనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు కొనాల గంగారెడ్డి, ధనగారి కృష్ణారెడ్డి, మల్లికార్జున్, వీరప్ప, సిద్ది మహేశ్, శంకర్ గౌడ్, అరుణ్, దేవకి సురేష్, అరవింద్, మాణిక్యం గుప్తా పాల్గొన్నారు.
