బోధన్ బతుకమ్మ :
రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ సూచనల మేరకు బోధన్ పట్టణంలో అరైవ్–అలైవ్ (Arrive Alive) అవగాహనా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఏ కార్యాలయం, ఆర్టీసీ డిపోల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సోఫీ, ప్రవీణ్ గుజార్‌తో పాటు ఇతర వైద్యులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, కార్యాలయాల సమీపంలో పాదచారుల భద్రత, ప్రమాదం జరిగిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్స్ ప్రాధాన్యత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రమాద కేసులపై వైద్యుల వివరణ, పార్కింగ్ క్రమశిక్షణ వంటి అంశాలపై వివరించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పట్టణ సీఐ వెంకటనారాయణ ఎస్ఐ భాస్కరాచారి బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.



