ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించిన మహనీయుడు ఆరెట్టి

0 8,788

. . . శ్రమజీవుల సాహిత్యానికి అంకితమైన ఆరెట్టి

 

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :

 

సమాజంలో ఉన్న సమస్యలపై ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించిన మహనీయుడు ఆరెట్టి అని ఆర్ఎస్పీ కన్వీనర్ కటారి రాములు అన్నారు. శ్రమజీవుల సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమాలకు బహుముఖ ప్రజ్ఞశాలిగా నిలిచిన ఆరెట్టి 14వ వర్ధంతిని సోమవారం ఆర్ఎస్పీ జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు, ఆరెట్టి తన జీవితమంతా ప్రజా చైతన్యం కోసం, అణగారిన వర్గాల విముక్తి కోసం సాంస్కృతిక–సాహిత్య–నాటక రంగాలను ఆయుధాలుగా మార్చుకున్న మహానుభావుడని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సాంస్కృతిక రూపాల్లో అర్థమయ్యేలా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో ఆయనది కీలక పాత్ర అని గుర్తు చేశారు. జోగిని వ్యవస్థ వంటి అమానుష సామాజిక అణచివేతలపై ధైర్యంగా ప్రశ్నిస్తూ సినిమాలు, నాటికలు, సాహిత్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రేకెత్తించిన పోరాటశీలి ఆరెట్టి అని తెలిపారు. అలాగే గుట్కా వంటి సామాజిక దుష్ప్రవర్తనలపై కూడా ప్రజలను జాగృతం చేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ మార్పుకు తన వంతు కృషి చేశారని అన్నారు. వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులను ఏకం చేస్తూ కమ్యూనిజం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహా మేధావి ఆరెట్టి అని, అణగారిన వర్గాలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదుర్కొనే ఆలోచనలను ప్రజల్లో రేకెత్తించి పోరాట మార్గాన్ని చూపిన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఆరెట్టి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాలు నిరంతరం కృషి చేస్తాయని, రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో సాంస్కృతిక–సాహిత్య ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చేపడతామని కటారి రాములు స్పష్టం చేశారు. ఆరెట్టి జీవితం, ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఏఐపీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం, ఆటో యూనియన్ నాయకులు అబ్దుల్ ముజీబ్, ముకుందం, సయ్యద్ రఫీవుద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్, కిషన్, శీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.