. . . దేశవ్యాప్త సమ్మె సందర్భంగా డిచ్ పల్లిలో భారీర్యాలీ, సభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నివసిస్తూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో డిచ్ పల్లి రైల్వే స్టేషన్ వద్ద నుండి బస్టాండ్ వరకు ర్యాలీ జరిపి, బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. టీయుసీఐ జాతీయ నాయకులు వనమాల కృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య లు మాట్లాడుతూ ఈరోజు సమ్మెలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారన్నారు. ఈ సమ్మె విజయం మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నదని ఆరోపించారు. అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతుందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఓట్లు సీట్లు దండుకుంటున్నదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ, ప్రజలను దోచుకుంటున్నదన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్రవేస్తూ, ప్రజాస్వామ్యవాదులను నిర్బంధిస్తున్నదన్నారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు, కనీస పెన్షన్ 9 వేలు అమలు చేయాలన్నారు. విబిజి రామ్ జి పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి, ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు విప్లవజేజేలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, యుటియుసి నాయకులు అనిల్, రాములు, ఏఐసిసిటియు నాయకులు ఖాజా మొయినుద్దీన్, వివిధ కార్మిక సంఘాల నాయకులు కిషన్, మురళి, మల్లికార్జున్, గంగాధర్, సాయినాథ్, భారతి, సాయరెడ్డి, కిరణ్, సాయిబాబా, స్వర్ణ, రేణుక, రాములు, దేవేందర్, సంధ్యారాణి, కవిత, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేష్, మోహన్, సుకన్య, వాణి, స్వరూప, అక్షయ్, పరశురాం, గోవర్ధన్, వసంత, సుకన్య, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

