. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఉద్యోగులందరూ సమయానికి హాజరుకావాలని, నియమ నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. పట్టణంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను డీఎంహెచ్ఓ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రం లో ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను, ఓపి రిజిస్టర్, మందుల స్టాకు రిజిస్టర్ ను, రిపోర్ట్ లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్ లను నిల్వచేసే ఐఎల్ఆర్ లో ఉష్ణోగ్రతలను రికార్డు చేయాలని అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాల లోపు రిజిస్ట్రేషన్ చేయాలని, వారిలో ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను హై రిస్క్ గర్భిణీలుగా గుర్తిస్తూ ప్రత్యేకంగా ప్రసవ ప్రణాళిక రచించాలన్నారు. అదే విధంగా ఉపకేంద్ర పరిధిలో కేటాయించినటువంటి లక్ష్యాలను 100% పూర్తి చేయాలని వైద్య సిబ్బందిని కోరారు. వారం తిరిగేలోపు అసంపూర్తి రికార్డులన్నింటినీ పూర్తిచేయాలని, ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ కీర్తి, నర్సింగ్ ఆఫీసర్ లు నేహా, అర్చన ఉన్నారు.

