బతుకమ్మ : నాగిరెడ్డిపేట : తెలంగాణ ప్రభుత్వం శాసన సభ లో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ ప్రజా ప్రతినిధులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు బుధవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మం భూషణ్ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం 30 ఏళ్ల పోరాటం ఫలించిందని 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో పాలుపంచుకున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. అలాగే పోరాటంలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రానున్న రోజుల్లో ఏ నోటిఫికేషన్ వేసిన వర్గీకరణతోనే వేయాలని డిమాండ్ చేశారు. మాదిగల కళా నెరవేర్చిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగ్గీ జయరాజ్, మాదిగ జర్నలిస్టు ఫోరం నాయకులు కుంటోళ్ల యాదయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తొంట సాయిలు, నాయకులు బాబురావు, రవి, సాయిలు, వివిధ గ్రామాలకు చెందిన ఎమ్మార్పీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.
