. . . జంతర్ మంతర్ వద్ద నిరసనలు
. . . సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
వెబ్ డెస్క్, బతుకమ్మ:
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ (సిఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దేశంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులు, యువకులు, సివిల్ సొసైటీ గ్రూపులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగాయి. ఈ ఆందోళనలు రాజకీయ అధికారం కోసం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పౌరుడి ఓటు హక్కు విలువను కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటమని నిరసనకారులు తేల్చిచెప్పారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు ఏకమై నిరసనల్లో పాల్గొన్నారు. మహిళా నిరసనకారులపై జంతర్ మంతర్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థినులను రోడ్లపై పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో అశోకా రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారుల నిరసన స్థలానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో దిగ్బంధించిన పోలీసులు, ఆందోళనకారులను అడ్డుకుని పెద్దఎత్తున అదుపులోకి తీసుకున్నారు.
