బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మండలం పోచారం తండా, రాంపూర్ తండాల్లో తీజ్ పండుగ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు పోచారం శ్రీనివాసరెడ్డి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంజారా మహిళలు సంప్రదాయ పద్ధతిలో పెంచిన గోధుమ గడ్డి బుట్టలను (తీజ్) ఎత్తుకుని నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి పోచారం ఉత్సాహంగా నృత్యం చేస్తూ పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు. తండాల్లో తీజ్ పండుగ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, పాటలతో సందడి నెలకొంది. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువతతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

