ఏర్గట్ల, బతుకమ్మ :
పీఎం శ్రీ ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా తనిఖీ బృందం సందర్శించి పాఠశాలలోని విద్యా, మౌలిక వసతులు, విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల బోధనా విధానాలను సమగ్రంగా పరిశీలించింది. తనిఖీలో భాగంగా అధికారులు తరగతి గదులను సందర్శించి విద్యార్థుల ప్రతిభ, వారి ప్రదర్శన, ఉపాధ్యాయుల బోధనా పనితీరును పరిశీలించారు. అలాగే పాఠ్యప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, టీచర్ డైరీలను తనిఖీ చేశారు. పాఠశాలలోని గ్రంథాలయ నిర్వహణ, సైన్స్ ల్యాబ్, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీ బృందానికి నోడల్ అధికారిగా వచ్చిన వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులు అన్ని విధాలుగా బాగున్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతున్నారని, ఉపాధ్యాయుల పనితీరు కూడా చాలా చక్కగా ఉందని ప్రశంసించారు. పరిశీలనకు వచ్చిన సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను గమనించి వారిని అభినందించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ పాఠశాల ప్రస్తుతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పనితీరు కూడా మెరుగ్గా ఉందని తనిఖీ బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ బృందం సభ్యులు కోకిల నాగరాజు, చిన్నయ్య, గంగా మోహన్, గంట అశోక్, రమేష్, విశ్వనాథ్, గంగాధర్, రాచర్ల గంగాధర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
