25.8 C
Hyderabad

సీబీఎస్ఈ సౌత్ జోన్ – 1 తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకి తొలి పతకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నవ్యభారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థి ఎం. స్వరిత్ తేజ్‌కు కాంస్య పతకం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం నమోదైంది. సీబీఎస్ఈ సౌత్ జోన్ – 1 తైక్వాండో ఛాంపియన్ షిప్ – 2026 లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ఎం.స్వరిత్ తేజ్ కాంస్య పతకం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సీబీఎస్ఈ పాఠశాలల చరిత్రలో సౌత్ జోన్ స్థాయిలో పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా మారాడు. నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఎం. స్వరిత్ తేజ్, అండర్-14 బాలుర (27–29 కేజీల విభాగం) క్యోరుగి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు ఆగస్టు 4 నుంచి 8, 2026 వరకు హైదరాబాద్ పటాన్‌చెరులోని ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో సౌత్ జోన్ పరిధిలోని వివిధ సీబీఎస్ఈ పాఠశాలల నుంచి అండర్ – 14, అండర్ -17, అండర్ – 19 బాలురు, బాలికల విభాగాల్లో అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొన్నారు. వారిని అధిగమిస్తూ స్వరిత్ తేజ్ సాధించిన విజయం విశేషంగా నిలిచింది. స్వరిత్ తేజ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక నాలుగు సంవత్సరాల నిరంతర సాధన, కఠిన శిక్షణ, క్రమశిక్షణ, పట్టుదల ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా క్యూరియస్ తైక్వాండో అకాడమీలో మాస్టర్ వినోద్ నాయక్ (3వ డాన్ బ్లాక్ బెల్ట్, అంతర్జాతీయ పతక విజేత, హెడ్ కోచ్) ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. ఆయన మార్గదర్శకత్వం, నైపుణ్యంతో కూడిన శిక్షణ స్వరిత్ తేజ్ విజయానికి కీలకంగా నిలిచాయి. ఈ సందర్భంగా తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలో తైక్వాండో క్రీడ అభివృద్ధికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, జిల్లా స్థాయి పోటీల నిర్వహణ, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఆటగాళ్లను సిద్ధం చేయడంలో సంఘం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. స్వరిత్ తేజ్ సాధించిన కాంస్య పతకం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా నవ్యభారతి గ్లోబల్ స్కూల్, క్యూరియస్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ తైక్వాండో సమాజానికి గర్వకారణమైన ఘనతగా నిలిచింది. ఈ సందర్భంగా స్వరిత్ తేజ్‌కు, ఆయన తల్లిదండ్రులకు, నవ్యభారతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి, కోచ్ మాస్టర్ వినోద్ నాయక్‌కు, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్‌కు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో స్వరిత్ తేజ్ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

More articles

Latest article