25.9 C
Hyderabad
Tuesday, August 4, 2026

మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఈ నెల 15 లోపు ఈ – కేవైసీ పూర్తి చేయించాలి

 

. . . రేషన్ డీలర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతోందని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల కోటాను దిగుమతి చేసుకుని వినియోగదారులకు సకాలంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  మంగళవారం ఆయా మండలాల రేషన్ డీలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, ఈ నెల (ఆగస్టు) 31వ తేదీ లోపు రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సీజన్‌లో సంభవించే వర్షాలు, వరదలు, నిల్వ సమస్యలు తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ, నిర్ణీత గడువు లోపు పంపిణీని పూర్తి చేయాలని, స్టాక్ బోర్డు తప్పక ప్రదర్శించాలని, బియ్యం తూకంలో తేడా ఉండకూడదని సూచించారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.  స్టాక్ నిల్వలు, వాటి వివరాలతో కూడిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డు హోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకులు సక్రమంగా తరలించేలా, బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ-పాస్ యంత్రాలలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. రేషన్ కోటా కలిగి  ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేసుకునేలా రేషన్ డీలర్లు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. జూలై 31 నాటితో పూర్తయిన గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించిందని అన్నారు. ఈ వెసులుబాటును వినియోగించుకుని రేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ e- చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.  గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కోటా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు ఆగస్టు 15వ తేదీ లోపే తప్పక ఈ-కేవైసీ చేసుకునేలా, తద్వారా అర్హులైన వారు రేషన్ కోటా కోల్పోకుండా రేషన్ డీలర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.టీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

The three-month ration quota must be distributed smoothly.

More articles

Latest article