. . . ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఆప్ ధర్నా
. . . ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ అహ్మద్
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్య అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లాంటి పలు డిమాండ్ లతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జునైద్ అహ్మద్, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జుబేర్ అహ్మద్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బోధన్‌లోని శక్కర్‌నగర్ ప్రభుత్వ మధు మాలంచ హైస్కూల్ (ఇంగ్లీష్ మీడియం)లో ఉర్దూను ప్రథమ భాషగా ఎంచుకోవాలనుకునే మైనారిటీ విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడం పట్ల పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని, అవసరమైన ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా కార్యకర్తలు పార్టీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ “విద్య ప్రతి ఒక్కరి హక్కు”, “ఉర్దూ మీడియం విద్యార్థుల హక్కులను కాపాడాలి” వంటి నినాదాలు చేశారు. అనంతరం సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు బారికేడ్ల వద్ద వారిని అడ్డుకున్నారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
