29 C
Hyderabad
Monday, August 3, 2026

మానేరు గుండె కోత.. “అన్నదాత” కడుపుకోత..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చెదిరిపోయిన” చెక్ డ్యాములు” ఆవిరైన కోట్ల నిధులు

 

. . . నాడు ప్రతిపక్షంలో నిలదీశారు.. నేడు అధికార పక్షంలో మౌనం పై ప్రజల సందేహాలు

 

. . . ఉసెత్త ని అధికార ప్రతిపక్షాలు

 

. . . 155 కోట్ల నిధులు ఆవిరైనట్టేనా..!

 

సిరిసిల్ల, బతుకమ్మ :

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలకు గుండె చప్పడై బతుకు తెరువుకు ఆధారమైన వేములవాడ నియోజకవర్గం లోని మూలవాగు సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని మానేరు వాగులపై పాలకులు కలల కట్టల పేరిట నిర్మించిన చెక్ డ్యాముల పరిస్థితులు అన్నదాతలను కంటతడి పెట్టిస్తున్నాయి. కోట్ల నిధులు కుమ్మరించిన అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయి తప్ప రైతులకు జరిగింది ఏమి లేదన్న ఆవేదన అన్నదాతల్లో వ్యక్తం అవుతుంది. చెక్ డ్యాములలో కొన్ని కొట్టుకుపోయి రైతుల బతుకులలో తీరని విషాదాన్ని నింపాయి. “చెక్ డ్యాములు ఇప్పుడు నిరార్ధకంగా మారిన పరిస్థితులు ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలో అయితే కనిపిస్తోంది.

. . . ఉరింపులతో మొదలై

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పరిధిలోని మూలవాగు సిరిసిల్ల పరిధిలోని మానేరు వాగుపై గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 150 కోట్లతో మిడ్ మానేరు డ్యాములో కలిసే వరకు మానేరు నిత్యం నీటితో కళకళలాడుతుందనే ఉరింపులతో సిరిసిల్ల మానేరు వాగుపై 11 చెక్ డ్యాములు, మూలవాగుపై 13 చెక్ డ్యాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసింది. దాదాపు పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చినట్లు సంబరాలు సైతం నిర్వహించారు. అప్పట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో నూతనంగా 68. 47 కోట్లతో మరో 12 చెక్ డ్యాములు నిర్మించేందుకు అప్పట్లో ప్రతిపాదనలు చేసినట్లు ఆనాటి ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే చెక్ డ్యాములు పూర్తి చేసినట్లు లెక్కల్లో చూపించిన కాంట్రాక్టర్లు బిల్లు సైతం తీసుకున్నట్లు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు జేబులు నింపేందుకే చెక్ డ్యాముల ప్రతిపాదన చేశారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గం లో ఒక్క చెక్ డ్యామ్ మినహా దాదాపు ఏ ఒక్క చెక్ డ్యాం అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకు సిరిసిల్ల పట్టణానికి వన్నె తెస్తుందనుకున్నా చెక్ డ్యాం కుప్ప కూలి చెక్ డ్యామ్ కు గండి పడ్డ చోట చిన్నారులు ఈత కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సంఘటన ఇంకా సిరిసిల్ల ప్రజల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిన విషాదఛాయ గుండె తడి చేస్తూనే ఉంటాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించినప్పుడు చెక్ డ్యామ్ లా పరిస్థితి మూనాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు.

. . . అప్పుడలా.. ఇప్పుడిలా…

గతంలో కొట్టుకుపోయిన చెక్ డ్యాముల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తీవ్ర ఆందోళన లు చేసిన పరిస్థితి. అఖిలపక్షం ఆధ్వర్యంలో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ గతంలో ఆందోళన చేసిన పరిస్థితి. ఈ విషయంలో ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా స్పందించిన పరిస్థితి లేకుండా పోయిందని మానేరు పరివాహక ప్రాంతం రైతులు చెబుతున్నారు. దాదాపు రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే మౌనం వహించాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టిపిసిసి అధ్యక్షుని హోదాలో 2023లో “హాత్ జోడో  యాత్రలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఆయన దృష్టికి చెక్ డ్యాముల విషయాన్ని తీసుకువెళ్లిన పరిస్థితి ఉండింది. ప్రతిపక్షంలో ఆనాటి బిఆర్ఎస్ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక అసలు ఆ ఊసే తీయకపోవడం అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్త లో చెక్ డ్యాముల అవకతవకల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటలకు ఎప్పుడో కాలం చెల్లిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు మాటల్లోనే నీటిని చూపించి ఆ మాటలు నీటి మూటలు గానే మిగిలిపోయాయనే ఆవేదన ప్రస్తుతం మానేరు పరివాహక ప్రాంతంలోని అన్నదాతల్లో వ్యక్తమావుతుంది. చెక్ డ్యాముల విషయంలో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిజానిజాలను ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని “జిల్లా పరిరక్షణ సమితి”నాయకులు బుస్సా వేణు ఈ సందర్భంగా ఆయా పార్టీలను కోరారు. ఏది ఏమైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇప్పటికైనా మౌనం వీడి చెక్ డ్యాములను రైతులకు అందుబాటులో కి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article