జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలం దోసపల్లి సంస్థాన్ శ్రీ జగద్గురు రామానందాచార్య జీ మఠం ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా న్యానిజ్ ధామ్ వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, భూమి, చెట్లు, నీటిని కాపాడుకోవడంతో పాటు ప్రకృతిని రక్షించాలనే సందేశంతో చేపట్టిన ఈ మహా పాదయాత్ర ఎంతో గొప్పదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఏలి గ్రామంలో కొనసాగుతున్న మహా పాదయాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. పాదయాత్రలో భక్తులతో కలిసి ఆయన అడుగులు వేశారు. అనంతరం శ్రీ జగద్గురు రామానందాచార్య జీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టిన ఈమహా పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హన్మంత్ షిండే తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడంతో పాటు నీరు, భూమి, ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భక్తులు, మఠం నిర్వాహకులు, పాదయాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రకృతిని కాపాడుదాం… భవిష్యత్ తరాలను రక్షిద్దాం అనే సందేశంతో ఈ మహా పాదయాత్ర కొనసాగుతోందన్నారు.
