30.9 C
Hyderabad
Monday, August 3, 2026

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేటి పరిస్థితులకు అనుగుణంగా బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ భవన్‌లో ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, పటేల్–పట్వారీల దోపిడికి ఎదురు నిలిచి తెలంగాణలో మహత్తర సాయుధ రైతాంగ పోరాటం సాగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దౌర్జన్యాలు, హింస, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక పోరాటం నిర్వహించారని తెలిపారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఈ ఉద్యమం భూమి పంపిణీ, వెట్టిచాకిరి నిర్మూలన, అప్పు పత్రాల రద్దు వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడిందని అన్నారు. సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా దొరలు, భూస్వాముల ఆధీనంలోని సుమారు 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేశారని, మూడు వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి తరం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో కేంద్రంలోని బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు, ముఖ్యంగా ఆదాని, అంబానీ వంటి పారిశ్రామిక వర్గాలకు అప్పగించే విధానాలను అమలు చేస్తోందని భూమయ్య విమర్శించారు. నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం, ఉపాధికి సంబంధించిన విధానాలు రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరుతో ప్రజలను నిరాశపరుస్తోందని, ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఆశించిన స్థాయిలో జరగలేదని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీలు వంటి ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రైతులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని, దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో బలమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని భూమయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకుల పాపయ్య, జిల్లా నాయకులు కే. గోపాల్, ఆర్. గంగాధర్, పీవైఎల్ జిల్లా నాయకులు బండమీది నర్సయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article