26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బహుజన కార్మిక సమస్యల పరిష్కారమే బిఎల్ టియు లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బహుజన కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బిఎల్ టియు) ప్రధాన లక్ష్యమని బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ పేర్కొన్నారు. శనివారం బిఎల్ టియు 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బిఎల్ టియు జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలోని కార్మిక వర్గంలో సుమారు 90 శాతం మంది బహుజన శ్రామిక కులాలకు చెందిన వారేనని, పెట్టుబడిదారుల్లో అధిక శాతం ఆధిపత్య కులాలకు చెందిన వారు ఉండటంతో బహుజన కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. భారత కార్మికోద్యమ నిర్మాత కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోఖాండే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానంతో బిఎల్ టియు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. పరిశ్రమలు, ఆర్థిక వనరులు, పెట్టుబడులు ప్రధానంగా ఆధిపత్య వర్గాల చేతుల్లో కేంద్రీకృతమై ఉండటంతో శ్రమించే వర్గానికి తగిన గౌరవం, న్యాయమైన వేతనాలు, కార్మిక హక్కులు దక్కడం లేదన్నారు. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయడంలో విఫలమవుతున్నాయని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, పెన్షన్ వంటి ప్రాథమిక హక్కులకు కూడా దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను సృష్టించేది కార్మిక వర్గమే అయినప్పటికీ, ఆ సంపదలో వారికి తగిన వాటా దక్కడం లేదని, శ్రమకు తగిన ప్రతిఫలం లేకపోవడం వల్ల పేదరికం, నిరుద్యోగం, అసమానతలు మరింత పెరుగుతున్నాయని అన్నారు. కార్మికుల సమస్యలను కేవలం వేతనాల కోణంలో కాకుండా సామాజిక న్యాయం, కుల ఆధారిత అసమానతలు, ఆర్థిక దోపిడీ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బహుజన శ్రామిక వర్గం సంఘటితమైతేనే తమ హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందని, అదే లక్ష్యంతో బిఎల్ టియు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేస్తూ ఉద్యమాలను నిర్మిస్తోందని దండి వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో జరుగుతున్న కార్మిక దోపిడీని అరికట్టాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ వంటి కార్మిక హక్కులను ప్రతి కార్మికుడికి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చివరగా, “బహుజన కార్మిక సమస్యల పరిష్కారమే బిఎల్ టియు లక్ష్యం అని స్పష్టం చేస్తూ, కార్మికులు కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ఐక్యమై తమ హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు యాటల అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు గౌడెల్లి గంగాశంకర్, నాయకులు విశ్వనాథ్, వెంకట్, నర్సింహులు, ఓం ప్రకాష్, చంద్రకాంత్, సబ్బని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article